Jagathguru Bhodalu Vol-2        Chapters        Last Page

జీవన్ముక్తి

అందరూ అన్ని జీవాలూ ఎప్పుడూ బతికేవుండాలని కోరిక కలిగివున్నా గతానుగతికంగా చస్తూ పుటుతూఉండటం మనం ప్రతిరోజూ చూస్తూఉన్న విషయమే. మరి మృత్యుంజయుల మాట ఏమిటి? అట్టివారు వున్నారా? పోనీ ఏ కాలమందైనా వున్నారా? ఉన్నారని ఇతిహాసాలు చెప్తున్నాయ్‌. ఇతిహాసాలమాట అటుంచి యిటీవలనే అవతరించిన సదాశివ బ్రహ్మేంద్రులు ఇట్టి చిరంజీవులే - అని చెపుతున్నారు. ఈ కాలజయం లేక మృత్యుజయం మనకున్నా కలగాలంటే దయాళువులు అయిన భగవత్పాదులు ప్రసాదించిన అమృతం సేవించాలి. అట్లా సేవిస్తే మనము జీవించియున్నపుడే జయం లభిస్తుంది.

'జాతస్య హి ధ్రువో మృత్యుః,

ధ్రువం జన్మ మృతస్య చ.' గీత. 22%

మనం యిపుడు బతికున్నా మంటే జన్మరాకుండా చేసుకొనే పనులు వెనుక జన్మలో మనము చేయలేదన్నమాట. ఈ జనని మరణ చక్రంలో చిక్కి తిరుగుతూ ఉండటంచేతనే మనం జనన మరణ నివృత్తి కలగడంకోసం పాటుపడటం.

శరీరం వుండబట్టి ఆకలిదప్పులు కలుగుతున్నై. వానిని తీర్చుకోడానికి కొన్ని వస్తువులను సేకరిస్తాం. మనకు ఈవస్తువుల మీద ప్రీతిన్నీ వేరు వస్తువులమీద వైరాస్యమున్నూ ఏర్పడుతూంది. మన బ్రతుకంతా ఆకలిదప్పులు పోగొట్టుకోడానికే అని తోస్తుంది.

మనిషికి శరీరంతో సంబంధం ఏర్పడడం పుట్టుక అనిన్నీ శరీరసంబంధం తొలిగిపోవడం మరణం అనిన్నీ చెప్తారు. శరీరం ఉన్నంతవరకూ ఆకలిదప్పులు ఉంటవి. శరీరంపోతే అవిన్నీ పోతవి. కొందరు నేరాలుచేసో, మనోవ్యధలు పొందో ఆత్మహత్య చేసుకొని శరీరంనుంచి తప్పించుకుపోదామని అనుకొంటారు. స్థూలశరీరబాధ వదలినా మరొకశరీరం కాచుక్కూచుంటుంది. ఆత్మహత్య మహాపాతకం అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయ్‌. ఈశరీరమే ఒక వ్యాధి. ఆత్మహత్య ఆ వ్యాథికి తగ్గ మందుకాదు. అది పాపపు పని. అమృతస్థితి చాలా గొప్పది. శైవము వైష్ణవము మొదలుగా ఎన్నోమతాలు ఉన్నవి అవి అన్నీ మా మతమే గొప్పదంటే మామతమే గొప్పదని అంటవి. భగవత్పాదులు ఇవి అన్నీ గ్రహింపదగినవే అని అన్నారు. కాని వానిచే ఈ వ్యాధికి తాత్కాలికోపశమనం కలుగునేమో కానీ శాశ్వతోపశమనం కాదు. వ్యాధి మూలముట్టుగా పోవాలంటే మూల కారణం నశించాలి. బొందిలో ప్రాణాలున్నపుడే ఔషధసేవ జరగాలి. గతించిన పిదప మందువేసుకోటం ఎట్లా? అదేం పనిచేస్తుంది?

'త మేవం విద్యా నమృత ఇహ భవతి,

నా7స్యః పంథా విద్యతే7యనాయ.'

అని పురుషసూక్తం. ఆత్మస్వరూపం ఎరిగినవాడు యీ ఆత్మలోనే అమృతత్వం పొందుతారు. అమృతత్వానికి అనగా ముక్తికి ఆత్మస్వరూపం ఎరగడంకంటే వేరే దారిలేదు. మోక్షంఅంటే చావుపుట్టుకలు లేకపోవడం. పై సూక్తంలో 'ఇహ' అనే పదం ఉన్నది. ఈ శరీరం ఉన్నపుడే - చావడానికి ముందే - చావులేని స్థితిని అందుకోగలం అని అర్థం. ఇహ లోకమందు కాక ఆ మోక్షం పరలోకమందే వస్తుందని అంటారా 'అల్ల మోక్షానుభవం ఇట్టిది' అని తెలియజెప్పటానికి పరలోకమందలి కొంతమందిని ఇక్కడికి రప్పించాలి. వారు ఇక్కడికి రారు. కనుక అది నిష్ప్రయోజనం. అందుచే ఆత్మజ్ఞానమే అమృతత్వం, మోక్షం అని తాత్పర్యం. ఆకలి దప్పులకు తినుబండాలు సేకరించుకోవడం, వాటిని కాపాడు కోవటానికి ఇల్లుకట్టుకోటం. ఆయింటిని కాపాడుకోవటానికి ఆలుబిడ్డలను చుట్టపక్కాలను ఏర్పరచుకోవటం ఇట్లా నీలకు నీల తగిలించినట్లు సంసారబంధం ఏర్పడుతోంది. అంతటితో ఆగక 'వీళ్ళే మనం' అనే అభిమానం కలుగుతోంది. శరీరం వ్యాధిగ్రస్తమైనపుడు 'నేను చిక్కిపోయినాను' అని అనుకొన్నట్లు వీరి బాధ్యతలు అన్నీ మనపై వేసుకొని వీరికొరతలన్నీ మనవే అని అనుకొని మనవాస్తవరూపాన్ని మరుగుపరచుకొంటున్నాము. 'నామనస్సు' 'నా వొళ్లు' అని ఒక్కొకపుడు మనం వ్యవహరించినా 'నేను అజ్ఞానిని' 'నేను గుడ్డివాడను' 'నేను కుంటివాడను' అని అనడంచేత దేహాభిమానం మనలను వదలడం లేదని వ్యక్తమవుతున్నది. ఈ అజ్ఞానంపోవటానికి ఆత్మజ్ఞానం వొక్కటే మందు. అట్టి జ్ఞానాన్ని శరీరం ఉన్పప్పుడే రూఢి చేసుకోవడం మోక్షం లేక అమృతత్వం అని సూత్రభాష్యంలో భగవత్పాదులు-

' త దేత దశరీరత్వం మోక్షమ్‌'

అని వక్కాణించారు.

మనకు చుట్ట క్కాలూ బంటువైనా ఉన్నారు. వారి సుఖదుఃఖాలు అభిమానం వున్నంతవరకూ మనవే అని అనుకుంటాం. అభిప్రాయభేదం కలిగితే, వైరమే కలిగితే -అప్పుడు వారి బాగోగులు చూడకపోవడమేగాక వారికి దుఃఖం ఏర్పడాలనిన్నీ అట్లా ఏర్పడితే చంకలు కొట్టుకోవాలనికూడా అనిపిస్తుంది. ఇందుకు కారణం అహంకార మమకారాలే! క్రమేణా శరీరాభిమానంపోవాలి. అల్లాపోతే కామక్రోధాలు భయద్వేషాలు నావికావు; ఆకలిదప్పులు శరీరానికి సంబంధించినవి. కనుక వీనితో నాకు సంబంధంలేదు. అనే జ్ఞానం కలుగుతుంది. ఇట్లా ప్రయత్నం చేస్తూ రాగా రాగా అభిమానాలన్నీ కొద్దికొద్దిగా తగ్గిపోతయ్‌.

ఆత్మ పరిశుద్ధమైన వస్తువని ఉపనిషత్తులు చెపుతున్నవి. అంతటా నిండియున్న ఆనందమే ఈశ్వరుడు. ఆ 'ఈశ్వరుడే నేను' అసలుమాట నెలకొనాలి. ఇంద్రియములచే తెలియబడే విషయములేవేరు. నేను వేరు అన్న ఎరుక కలగాలి.

'తం స్వాచ్ఛరీరాత్‌ ప్రవృహేన్‌ ముంజాదివేషీకాం

ధై ర్యేణ తం విద్యా చ్ఛుక్ర మమృతమ్‌' -కఠ.

ముంజ అనే గడ్డి మొక్కనుండి మొవ్వును వేరుచేసినట్లు శరీరమునుండి ఆత్మను ధైర్యంతో వేరుచేయాలి. చూచేవాడు వేరు, చూడబడేది వేరు. శరీరం చూడబడేది. ఆత్మ చూచే వాడు. ఆత్మను చూడగలనని అనుకొనేవాడు అజ్ఞాని.

'అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాత మవిజానతామ్‌.' -కేన.

తెలుసునని అనుకొనేవాడికి అది తెలియదు. తెలియదని అనుకొన్నవాడికి అది తెలుసు.

శరీరమనే రోగం అంతరిస్తే గాని మనం అమృతులం కాలేము. ఈశ్వరుడు అశరీరి అనగా శరీరంలేనివాడు. కనుక 'ఈశ్వరుడే నేను' అని భావించాలి. ఇదియే 'సోహం'. కొందరుకొందరు కూచున్నపుడూ నుంచున్నప్పుడూ నడచుచున్నప్పుడూ సోహం సోహ మ్మని జపంచేస్తూ ఉంటారు. దానిని సార్థకం చెయ్యడం చాలాగొప్పమాట. నేను శరీరం కాను (నాహం శరీరమ్‌) అని చెప్పడం సులభ##మేకాని అనుభవానికి తెచ్చుకోవడం కష్టం. ఏచిన్న దెబ్బతగిలినా తలకిందులయిపోయే మనం శరీరానికి ఏది కలిగినా 'శరీరానికి వుండే స్వభావమే యిది' అని గణించకుండావుండటం శ్రమసాధ్యమే. అట్లా సాధ్యపడకపోతే 'యీ లోకంలోని సమస్త శరీరాలలూనావే' అనేభావన చెయ్యడం ఒక వుపాయం. అట్టిభావం కలిగితే యితరుల కష్టాలను జూచి వారికి సహాయం చెయ్యాలని మంచిసంకల్పం కలుగుతుంది. 'ఇతరుల కష్టాలు నావే' అన్న సర్వాత్మక బుద్ధి కలుగుతుంది. కృష్ణుడు గీతలలో చెప్పినట్లు కర్మలన్నింటినీ ఈశ్వరార్పణం చేసి మనం యితరులకోసం ఎప్పుడూశ్రమించాలి. దేహధారులమైన మనం సోహంభావన యందు సుస్థిరులమై 'నమః పార్వతీపతయే' అని అంటూ అంటూ దేహత్యాగం చేయడం విధి. శాస్త్రం 'ఇదే జీవన్ముక్తి' అని చెప్తోంది.

'అశరీరం వావ పంతం న ప్రియా ప్రియే స్పృశతః' -బృహ.

శరీరంలేని పురుషుని సుఖదుఃఖాలు ఎప్పుడూఅంటవు.

భగవత్పాదులు బ్రహ్మసూత్రభాష్యంలో-

'గౌణ మిథ్యాత్మనో7సత్యే పుత్త్రదేహాది బంధనాత్‌,

సద్‌బ్రహ్మాత్మాహ మిత్యేవం బోధే కార్యంకథంభ##వేత్‌?'

అని వ్రాశారు. గౌణాత్మ మిథ్యాత్మ ముఖ్యాత్మ అని ఆత్మ మూడువిధాలు. పుత్రమిత్రాదుల సంబంధం కల్పించుకొని వారి సుఖదుఃఖాలు మనవి అని అభిమానించేవి గౌణాత్మ. గౌణమనగా అప్రధానం. ఔపచారికం. పుత్ర మిత్రాదులు వేరు. మనం వేరు అని తెలిసిన్నీ 'మనం మనం' అని అభిమానించడమే గౌణం. 'శరీరమే నేను' అని అభిమానించేదే మిధ్యాత్మ. సద్‌ బ్రహ్మమే నేను అనేది బ్రహ్మాత్మ లేక ముఖ్యాత్మ. గౌణమిథ్యాత్మలను త్రోసివేస్తే పుత్ర మిత్రాదుల సంబంధం శరీ రేంద్రియసంబంధం తొలగిపోతుంది. అప్పుడు సద్‌ బ్రహ్మాస్మ్సినేనేబ్రహ్మను, అన్న జ్ఞానం కలుగుతుంది. అటుమీద మరి చేయదగు పనిలేదు. పరమాచార్య ప్రసాదమైన యీతత్వౌషధం సేవిస్తే మనకు అశరీరస్థితియున్నూ నిష్కళంకానందమున్నూ లభిస్తుంది.


Jagathguru Bhodalu Vol-2        Chapters        Last Page